New Criminal Laws: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమీక్ష కోసం పార్లమెంట్‌కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది. ఆ బిల్లు ప్రకారం.. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే నకిలీ వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సెక్షన్ 195 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
సెక్షన్ 195 (1) (డీ) ప్రకారం.. “భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత లేదా భద్రతకు భంగం కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని తయారు చేస్తే లేదా ప్రచురించినట్లయితే, మూడు సంవత్సరాల వరకు పొడిగించబడే జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.” ఈ విభాగం కొత్తగా ప్రతిపాదించబడిన బిల్లులోని 11వ అధ్యాయంలో కింద ‘ప్రజా ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరాలు’ కింద, ‘ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు’ అనే అంశం క్రింద ఉంది. ప్రస్తుతం ఐపీసీలోని సెక్షన్ 153బీ కింద ‘ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు’కి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
Read Also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయం కోసం మూడు బిల్లులను హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.పౌరులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను పరిరక్షించడమే ఈ మూడు కొత్త చట్టాల ఆత్మ అని బిల్లులను ప్రవేశపెడుతూ అమిత్ షా అన్నారు. మూడు బిల్లులు – భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023 కాగా.. బానిసత్వానికి సంబంధించిన అన్ని సంకేతాలను అంతం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్న ప్రతిజ్ఞను నెరవేర్చారని ఆయన అన్నారు.
ఈ బిల్లులు బ్రిటీష్ వారు రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, (1898), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872)లను రద్దు చేస్తాయి. భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా బిల్లు రానుందని అమిత్ షా చెప్పారు.