Earthquakes in Turkey, Syria: టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరో రెండు భూకంపాలు సంభవించడం ఆందోళన కల్గిస్తోంది. టర్కీలో 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు సంభవించాయి. దాదాపు ఒక శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపం సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాను తాకింది, 2,300 మందికి పైగా ప్రజలు భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు భవనాలు నేలమట్టం అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం రిక్టారు స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. గంటల తర్వాత మరో రెండు విధ్వంసకర భూకంపాలు సంభవించాయి. సిరియాలోని తిరుగుబాటుదారులు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 810 మంది మరణించారని రాష్ట్ర మీడియా, వైద్య వర్గాలు తెలిపాయి. టర్కీ అత్యవసర సేవల ప్రకారం.. టర్కీలో మరో 1,498 మంది మరణించారు.
మొదట 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. అనంతరం 7.5, 6 తీవ్రతతో 50కి పైగా ప్రకంపనలు సంభవించాయి. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది.
Biggest Earthquakes: అత్యంత ప్రమాదకరమైన 5 భూకంపాలు ఇవే..
శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు కాబట్టి.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. టర్కీలో మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉండగా.. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు.. ఈ భారీ భూకంపం దెబ్బకు ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఇళ్లల్లోకి వెళ్లొద్దని సూచించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాగే.. సహాయక చర్యలు చేపట్టాలని, బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. ఇదిలావుండగా.. టర్కీలో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. 2020లో జనవరి నెలలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.