NTV Telugu Site icon

Pakistan: పోలీస్ స్టేషన్‌పై తాలిబన్ల దాడి.. ముగ్గురు పాక్ పోలీసులు మృతి

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తానీ తాలిబన్‌కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ గిరిజన జిల్లా సరిహద్దులోని సర్బంద్ పోలీస్ స్టేషన్‌పై ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఆటోమేటిక్ ఆయుధాలు, స్నైపర్ షాట్‌లతో దాడి చేశారు. క్రాస్ ఫైరింగ్‌లో ముగ్గురు పోలీసులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి కాషిఫ్ అబ్బాసీ తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

చనిపోయిన ముగ్గురు పోలీసులలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్దార్ హుస్సేన్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిని పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టారని, ధైర్యంగా పోరాడారని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా పోలీస్ చీఫ్ మోజమ్ జా అన్సారీ తెలిపారు. భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో డీఎస్పీ గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ ఘటనను ఖండిస్తూ, ఉగ్రవాదంపై పోరులో పోలీసుల త్యాగం వృథాగా పోదని అన్నారు. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్‌కు డీఎంకే నేత బెదిరింపు

గత రాత్రి పెషావర్‌లోని రెండు పోలీసు పోస్టులపై తమ ముజాహిదీన్ లేజర్ గన్‌లతో దాడి చేసినట్లు టీటీపీ ప్రతినిధి ముహమ్మద్ ఖురస్సాని ఒక ప్రకటనలో తెలిపారు. రెండు కళాష్నికోవ్‌లు, రెండు మ్యాగజైన్‌లు, రూ.47,000 స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దాడిలో డీఎస్‌పీ ర్యాంక్ పోలీసు అధికారితో సహా నలుగురు పోలీసులను చంపినట్లు, ముగ్గురు గాయపడ్డారని టీటీపీ పేర్కొంది.

తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)ని సాధారణంగా పాకిస్తానీ తాలిబాన్ అని పిలుస్తారు, ఆఫ్ఘన్-పాకిస్తానీ సరిహద్దులో పనిచేస్తున్న వివిధ సాయుధ తీవ్రవాద గ్రూపుల గొడుగు సంస్థగా ఇది రూపొందింది. 2007లో ఏర్పడిన ఈ బృందం ఆఫ్ఘన్ తాలిబాన్‌తో ఉమ్మడి భావజాలాన్ని పంచుకుంటుంది. 2001–2021 యుద్ధంలో వారికి సహాయం చేసింది.