దరఖాస్తు గడువు దగ్గరపడుతుండడంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read:Tripura: పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం..
అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి వాయిదా మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమలులోకి వస్తుంది. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. గతంలో ఉన్న 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈసారి 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొంది. కొత్త లైసెన్స్ కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.
