Flash Floods in Sikkim: సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయారు. ఈ విషయాన్ని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లాచెన్ లోయలో ఉన్న తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతంలో 15-20 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల వరకు ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల తీవ్రతకు లాచెన్ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతయారు.
Also Read: Top Headlines@9AM: టాప్ న్యూస్!
ఆకస్మిక వరదల కారణంగా 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. ఆకస్మిక వరదలు లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థాపనలకు కూడా నష్టం కలిగించింది. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జ్ కుప్పకూలింది. పశ్చిమ బెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి చాటా చోట్ల కొట్టుకుపోయింది. వరదలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి.