దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. దాదాపు 35,000 యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్ వరుస పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్‌లో బ్యాటరీ తయారీ కేంద్రం ఉంది. ఫ్యాక్టరీలో ఉదయం 10.30 గంటలకు మంటలు చెలరేగాయి.
ఇప్పటివరకు 20 మృతదేహాలను ప్రమాదం జరిగినచోట అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీలు వేగంగా మండటం.. అత్యధిక ఉష్ణోగ్రతలు వెదజల్లడంతో తొలుత సహాయక చర్యలు కష్టంగా మారాయి. దీనికితోడు నీరు ఈ బ్యాటరీలపై మంటలు ఆర్పలేదు. ఈనేపథ్యంలో డ్రైశాండ్‌ను కూడా వినియోగించారు. ఈ కర్మాగారంలో ప్రమాదం జరిగే సమయంలో సుమారు 100 మంది పని చేస్తున్నారు. వీరిలో 78 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు యూన్‌సుక్ యోల్ స్పందించారు. అధికారులు అందుబాటులో ఉన్న వనరులు, సిబ్బందిని వినియోగించి ప్రమాదాన్ని అదుపుచేయాలని ఆదేశించారు. ప్రపంచంలో బ్యాటరీల తయారీ రంగంలో దక్షిణ కొరియా చాలా ముందుంది. అంతేకాదు.. వాటిని వినియోగించే కార్లు కూడా అక్కడ ఎక్కువే.