NTV Telugu Site icon

Delhi Airport: రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం

Delhi Airport

Delhi Airport

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అధికారులు వెల్లడించారు. రెండూ.. విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానాలే కావడం గమనార్హం. ఆ రెండు విమానాల్లో ఒక‌టి టేకాఫ్ తీసుకోనుండ‌గా, మ‌రొకటి ల్యాండింగ్‌కు సిద్ధమైంది.

Read Also: Chandrayaan-3: ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ

ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళ్తున్న విమానం యూకే725 టేకాఫ్ తీసుకోనుండ‌గా, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వ‌స్తున్న విమానం రన్‌పై ల్యాండింగ్ కానుంది. అయితే ఒకేసారి రెండింటికి సిగ్నల్స్ ఇవ్వడంతో ర‌న్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే ప‌రిస్థితి ఏర్పడింది. కానీ ఏటీసీ చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రించ‌డంతో ఆ ప్రమాదం త‌ప్పింది. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్‌ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కిలోమీటర్లు మాత్రేమే ఉంది. సాధారణంగా విమానం టేకాఫ్‌ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలకు అనుమతి ఉండదు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు.

Read Also: Ukraine Drone Attack: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్‌

ఈ ప్రమాదం త‌ప్పడం వ‌ల్ల సుమారు 300 మంది ప్రయాణికులు సుర‌క్షితంగా ఉన్నారు. ఆ రెండు విమానాల్లో 300 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అహ్మదాబాద్ నుంచి వ‌స్తున్న విమానంలో ఉన్న 45 ఏళ్ల మ‌హిళా పైలెట్ సోనుగిల్ ఈ ప్రమాదాన్ని త‌ప్పించిన‌ట్లు చెబుతున్నారు. ఆమె ఏటీసీకి సంకేతాలు ఇవ్వడం వ‌ల్ల ఆ వెంట‌నే టేకాఫ్ తీసుకుంటున్న విమానాన్ని ఏటీసీ నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది.