చిన్న చిన్న కారణాలకే పిల్లలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన ఫోన్ రిపేర్ చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించిన పాపానికి.. ఆవేశంలో తనువు చాలించింది. ఈ ఘోరం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెలాల గ్రామంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెలాల గ్రామానికి చెందిన సారక్క, స్వామి దంపతుల కుమార్తె సాయి సుమ(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆమె ఫోన్ పాడైపోయింది. దీంతో ఫోన్ రిపేర్ చేయాలని తల్లిదండ్రుల్ని కోరింది. కానీ అందుకు వారు నిరాకరించారు. ఎక్కువగా ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తోందని చేయమని చెప్పారు. తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. దీంతో సాయిసుమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన సోదరుడు.. తలుపు ఎంత సేపు కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ రిపేరేనా? లేదంటే ఆమె మృతి వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయిసుమ ఆత్మహత్యతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.