Chandragiri: ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్ళల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: Palnadu: పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.. చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలు
చంద్రగిరిలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి హింసాత్మక దాడులకు తావు లేకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో నిమగ్నమై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
