NTV Telugu Site icon

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం

Arvind Kejriwal

Arvind Kejriwal

మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది. మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ తీర్పును రిజర్వ్‌లో ఉంచి, ఆ తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరి కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మళ్లీ జులై 12న మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు.

READ MORE: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వడం లేదని సీబీఐ తన దరఖాస్తులో పేర్కొంది. కొత్త మద్యం పాలసీలో లాభాల మార్జిన్‌ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడానికి గల కారణాలపై కూడా కేజ్రీవాల్ సరైన సమాధానం చెప్పలేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో క్యాబినెట్‌లో మద్యం పాలసీని మార్చడం అవసరమా? అలాగే సౌత్ లాబీకి సంబంధించిన కేసులో నిందితులు ఢిల్లీలో మకాం వేసి కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన విజయ్‌నాయర్‌తో టచ్‌లో ఉన్నారని సీబీఐ పేర్కొంది. అలాగే కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు తొందరపడిందని ప్రశ్నించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన సమయంలో.. అతని సన్నిహితుడు విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో అనేకసార్లు సమావేశమయ్యారని ఆరోపించింది. కోట్లాది రూపాయల లంచం డిమాండ్ చేశారని, గోవా ఎన్నికలలో సుమారు 44.5 కోట్ల రూపాయల లంచాన్ని ఉపయోగించారని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అర్జున్ పాండే మరియు గౌతమ్‌తో భేటీకి కారణం వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని పేర్కొంది.