Animal Blood Racket: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.
కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Drug Racket Busted: పాన్ మసాలా మాటున డ్రగ్స్ దందా.. అంతర్రాష్ట్ర పెడ్లర్ అరెస్ట్
సోదాల సమయంలో సీజ్ చేసిన రక్త ప్యాకెట్లను హర్యానాలోని పాలీ మెడికూర్ (Poly Medicure) కంపెనీకి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ రక్తాన్ని ఎలాంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా అనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అనుమతులు లేకుండా జంతు రక్తాన్ని సేకరించి తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత రెండు రోజులుగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నికేష్ పట్టుబడితే రక్త సేకరణ విధానం, ఎక్కడ నుంచి ఎంత మొత్తంలో రక్తం తీసుకుంటున్నారన్న అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశాల్లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం లభించింది.
ఈ ఘటనపై కేంద్ర డ్రగ్ కంట్రోల్, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు కలిసి సమగ్ర విచారణ చేపట్టారు. అక్రమ రక్త వ్యాపారం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా బయటకు తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నికేష్ దొరికితే రక్త సేకరణ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.