NTV Telugu Site icon

Siddaramaiah:100 శాతం రిజర్వేషన్ పై విమర్శలు..బిల్లును తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం

Siddaramaiah.

Siddaramaiah.

ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మంత్రివర్గం నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ‘కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్’ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్”లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు తమ సొంత భూమిలో సుఖంగా జీవించే అవకాశం కల్పించాలని మా ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మేము కన్నడ అనుకూల ప్రభుత్వం. కన్నడ ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత అన్నారు.

READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్

కాగా.. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు చేసిన పోస్ట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించారు. కర్ణాటక సర్కారు నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో సిద్ధరామయ్య తాను చేసిన పోస్టును తొలగించారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు కర్ణాటక కార్మిక శాఖ వివరణ ఇచ్చింది.