మొత్తానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం థియేటర్ల ఆక్యుపెన్సీని నూరుశాతానికి పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 14వ తేదీ నుండే అమలు కాబోతోంది. దాంతో రేపు విడుదల కాబోతున్న ‘మహా సముద్రం’ చిత్రంతో పాటు ఎల్లుండి, 15వ తేదీ జనం ముందుకు రాబోతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘పెళ్ళిసందడి’ చిత్రాలకు బోలెడంత మేలు చేసినట్టు అయ్యింది. పైగా కర్ఫ్యూ సమయాన్ని సైతం అర్థరాత్రి 12 గంటల నుండి ఉదయం గం. 5.00 లకు ప్రభుత్వం కుదించింది. దాంతో థియేటర్లలో సెకండ్ షో ప్రదర్శనకూ ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. నూరు శాతం ఆక్యుపెన్సీ, నాలుగు ఆటల ప్రదర్శన దసరా పండగకు సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలకు బాగా కలిసి వచ్చే అంశమే. అలానే టిక్కెట్ రేట్లను పెంచే విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే… చిత్రసీమ మొత్తం జై జగన్ అంటుందనడంలో సందేహం లేదు.