ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్‌ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న బాంద్రా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య జరగడంతో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో కుట్రదారుడైన జీషన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో జీషాన్ అక్తర్ (22)ను అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
జీషన్ అక్తర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ బుధవారం తెలిపారు. అనంతరం అతన్ని విచారిస్తామని పేర్కొన్నారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీని హత్య చేసేందుకు జీషన్ అక్తర్, శుభం లోంకర్‌లకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?
బాబు సిద్ధిఖీ హత్య కేసులో అరెస్టైన నిందితులను విచారించగా జీషాన్ అక్తర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు ప్రణాళిక వేసింది జీషానేనని వెల్లడించారు. హత్య జరిగిన వెంటనే నకిలీ పాస్‌పోర్టును వినియోగించి దేశం విడిచి పారిపోయాడు. దీంతో జీషాన్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో అతడు కెనడాలో అరెస్ట్ అయ్యాడు.
జీషాన్ అసలు పేరు మొహమ్మద్ యాసిన్ అక్తర్.. పంజాబ్‌లోని జలంధర్ వాసి. 2022లో పంజాబ్ పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2024, అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీ ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.
