వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని.. ఇది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఈ మాట్లాడుతున్న మాటలు ఇతర కులాల్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికే అధికారం ఇవ్వాలని.. రెడ్డి సామాజిక వర్గానికే నాయకత్వం కట్టబెట్టాలని వ్యాఖ్యానించారని.. మిగతా వర్గాల వారు అర్హులు కాదని అన్నట్లుగా మాట్లాడారని విమర్శించారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కుల రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుందా..? అని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా మాట్లాడటం భావ్యమేనా వైస్ షర్మిళ అన్నారు.
ఒక మాట మాత్రం నిజం చెప్పారని.. రాజశేఖర్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు వైఎస్ షర్మిళ. గొప్ప నాయకుడు కావాలంటే కులం అవసరం లేదని..మంచి మనసు ఉండాలని, విశ్వాసనీయత ఉండాలని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలని, గుండెలో నిజాయితీ ఉండాలని ఆమె అన్నారు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మంచి మనిషే మంచి నాయకుడు అవుతారని.. మంచి నాయకుడే గొప్ప నాయకుడు అవుతారని అన్నారని తెలిపారు.రెడ్డి సామాజిక వర్గం ఎంతో మంది మిగతా వర్గాలను ఆదుకున్నారు, అండగా నిలబెట్టారు కాబట్టే తెలంగాణ సమాజం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదరిస్తోందని, గౌరవిస్తోందని షర్మిళ అన్నారు. కానీ సమాజం బ్లాక్ మెయిలర్లను, దొంగలను గుర్తించదు, గుర్తించదు ఇది గుర్తుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రజలకు కావాల్సింది కుల, మత రాజకీయాలు కాదని ఇది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంటే.. బీజేపీ ఎప్పటిలాగే మత రాజకీయాలు చేస్తోందని షర్మిళ విమర్శించారు.