CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్‌ల తాళాలను లబ్ధిదారులకు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఈ ఫ్లాట్లను నిర్మించారు, ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఫ్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందించారు.
Read Also: UtterPradesh: పది రూపాయల గొడవ .. దుకాణదారుడిపై దుండగుల కాల్పులు…
ఒక్కో ఫ్లాట్‌లో 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు గదులు, వంటగది, మరుగుదొడ్డి ఉన్నాయి. ఫ్లాట్‌ల కోసం 6,000 మందికి పైగా ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లాటరీ పద్ధతిలో 1,590 మందిని అర్హులుగా గుర్తించారు. 2017కి ముందు ఏ మాఫియా అయినా పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూమిని లాక్కునే రాష్ట్రంగా యూపీ ఉండేదని.. అప్పుడు పేదలు నిస్సాహయంగా చూడారు.. ఇప్పుడు మనం ఇదే భూమిలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని.. ఈ మాఫియా భూమిని తీసుకుని పెద్ద విజయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు.
ఉమేష్ పాల్ హత్య, కిడ్నాప్ కేసులతో పాటు 100 క్రిమినల్ కేసుల్లో దోషిగా ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయాగ్ రాజ్ లో కాల్చిచంపారు. వైద్యపరీక్షల నిమిత్తం వీరిద్దర్ని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మీడియా చుట్టుముట్టిన సమయంలో, మీడియా ముసుగులో వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు అతిక్ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.