Yogi Adityanath: వివాదాస్పద ‘‘బాబ్రీ మసీదు’’ మరోసారి వార్తల్లో అంశంగా మారింది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు నిర్మాణం రేపు ప్రారంభం కానుంది. నిరసనగా హిందూ సంస్థలు లక్నో నుంచి ముర్షిదాబాద్ వరకు మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారియి. బాబ్రీ మసీదు ఎప్పటికీ పునర్నిర్మించబడదని మంగళవారం ఆయన అన్నారు. అదే విధంగా వారి కలలు ఎప్పటికీ నెరవేరవని చెప్పారు.
బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. అయోధ్యపై బీజేపీ వైఖరిని గర్తు చేస్తూ.. ‘‘మేము రామ్ లల్లా కోసం వస్తామని చెప్పాము, అదే చోట దేవాలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఎవరికైనా ఇంకా అనుమానం ఉందా.? ’’ అని అన్నారు. కయామత్ దినం రాదన్నది నిజం, అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఆ రోజు కోసం ఎదురుచూసే వారు, అలాంటి కలలు పెట్టుకోవద్దని సూచించారు.
భారతదేశ వారసత్వం, అద్భుతమైన సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని నొక్కి చెబుతూ, కాషాయ జెండా ఎల్లప్పుడూ దేశ గౌరవాన్ని పెంపొందిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. అవకాశవాదులకు సంక్షోభ సమయాల్లో మాత్రమే శ్రీరాముడు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత మరిచిపోతారని, రాముడు కూడా అలాంటి వారిని మరచిపోతారని సీఎం యోగి అన్నారు. రామభక్తులపై కాల్పులు జరిపి, రాముడి లక్ష్యాన్ని అడ్డుకున్న వారికి చోటు లేదని అన్నారు. ఇదే సమయంలో చట్టాన్ని పాటించే వారు ప్రయోజనం పొందుతారని, అలా చేయని వారు నరకానికి వెళ్తారని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా స్వర్గానికి చేరుకోగలమని నమ్మే వారి కలలు ఎప్పటికీ నెరవేరవని ఆయన అన్నారు.
భారత్, సనాతనం పరస్పరం అని రెండింటిని విడదీయలేమని ముఖ్యమంత్రి అన్నారు. సనాతనంపై కుట్రలు పన్నుతున్నవారు వాటికే బలైపోయారని, అలాంటి ఎజెండాలు పనిచేయమని యోగి హెచ్చరించారు. 2017 కి ముందు పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ అల్లర్లు, తరచుగా కర్ఫ్యూలు మరియు అభద్రతా వాతావరణంతో నిండి ఉండేదని, ఆ సమయంలో మహిళలు, వ్యాపారులు, రైతులు, యువత సురక్షితంగా లేరని, దేవాలయాలు, పాఠశాలు, ఇళ్లు కూడా సురక్షితంగా లేవని యోగి అన్నారు. గతంలో ప్రతీ మూడు నాలుగు రోజులకు ఏదో జిల్లాలో కర్ఫ్యూ విధించేవారని, ఇప్పుడు అలాంటి భయాలు లేవని చెప్పారు.
