రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో జరుగుతోన్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. అధికార పక్షానికి చెందిన అభ్యర్థి ఎవరు? అనే విషయంపై రకరకాల ప్రచారం సాగుతుండగా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు.. విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి ఓకే చెప్పాయి.. ఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.. పార్లమెంట్ హౌస్ ఎనెక్స్‌లో విపక్ష నేతలు భేటీ అయ్యారు.. శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రఫుల్ పటేల్ తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఈనెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు..
Read Also: President Poll 2022 : కేసీఆర్ మద్దతు ఆయనకే.. శరద్ పవార్ ఓ కీలక ప్రకటన
టీఎంసీ నేతగా ఉన్న యశ్వంత్ సిన్హా ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో కొన్ని పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. దీంతో, టీఎంసీకి రాజీనామా చేశారాయన.. ఆ తర్వాత ఈరోజు ఏకగ్రీవంగా ప్రతిపక్షాలు ఓకే చెప్పాయి.. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ను.. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపికచేశారు.. కాగా, రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవాలని అనుకున్నాం.. ఈరోజు జరిగిన సమావేశంలో యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశాం.. అన్ని రాజకీయ పార్టీలకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు జైరాం రమేష్.
కాగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి.. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్లు వినిపించినా.. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వారు నిరాకరించారు. ఇక, ఇవాళ జరిగిన సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు.. ఇక, టీఎంసీకి రాజీనామా అంశంపై స్పందించిన యశ్వంత్ సిన్హా.. టీఎంసీలోమమతాజీ నాకు అందించిన గౌరవం మరియు ప్రతిష్టకు నేను ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను పార్టీ నుండి వైదొలిగి ప్రతిపక్ష ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆమె నా రాజీనామాను ఆమోదిస్తుందని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా.. జులై 18న ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ నిర్వహించనున్నారు.