Womens Shave Heads for Cash Reward in Salem: డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది. సినిమాలో లచ్చిమిదేవి డబ్బులు ఇస్తుందని చెప్పి రవితేజ అరగుండు గీయించగా.. ఇక్కడ ప్రభుత్వ పథకం పేరుతో గుండు గీయించుకుంటే నగదు ప్రోత్సాహకం ఇస్తామని నమ్మించి పలువురు మహిళలను బురిడీ కొట్టించాడు ఓ ఆకతాయి. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగుచూసింది.
సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు సోమవారం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను జిల్లా తాలూకా కార్యాలయంలో ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్న అతడు.. కరోనా తరహాలో కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, విదేశాల్లో మహిళలు గుండు గీయించుకోవడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పి భయపెట్టాడు. ఇదే విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని నమ్మబలికాడు. అంతేకాకుండా గుండు గీయించుకున్న ప్రతి మహిళకు రూ.15 వేలు, విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్ కూడా అందిస్తామని చెప్పాడు. పురుషులకు రూ.6 వేలు ఇస్తారని, సీఎం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. కేవలం 18 మందికే టోకెన్లు కేటాయించామని, ఆ జాబితాలో పళనియమ్మాళ్ పేరు ముందుందని చెప్పడంతో ఆమె ఈ విషయాన్ని నిజమని నమ్మింది.
వెంటనే పళనియమ్మాళ్ తన చుట్టుపక్కల మహిళలకు ఈ విషయం తెలియజేసింది. ప్రభుత్వం నుంచి నగదు వస్తుందనే ఆశతో పలువురు మహిళలు హడావుడిగా క్షురకుడిని పిలిపించుకుని గుండు గీయించుకోవడం ప్రారంభించారు. మొదటగా కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ఉత్సాహంగా గుండు గీయించుకున్నారు. మరికొందరు కూడా అదే పనికి సిద్ధమయ్యారు. అయితే నగదు ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు పళనియమ్మాళ్ తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. పలుమార్లు ప్రయత్నించినా ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే మిగతా మహిళలకు గుండు గీయించే కార్యక్రమాన్ని నిలిపివేశారు.
అనంతరం ఆరా తీస్తే ఇదంతా ఓ ఆకతాయి చేసిన మోసపూరిత చర్య అని తెలుసుకుని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు లేదా ఇతర సంస్థల పేరుతో ఫోన్ చేసి నగదు, బహుమతులు ఇస్తామని చెప్పే మోసగాళ్ల మాటలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

