High Court: అత్తమామల నుంచి వేరు కావాలని, తనకు భరణం కావాలని కోరిన ఓ కేసుపై జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనుస్మృతి’ని ఉటంకిస్తూ స్త్రీ గొప్పతనం, బాధ్యతలను గురించి న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మహిళలు తమ వృద్ధ అత్తమామలకు లేదా అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు పేర్కొంది. అత్తమామలకు సేవ చేయడం భారత దేశంలో సాంస్కృతిక వస్తున్న అభ్యాసంగా చెప్పింది.
ఒక వ్యక్తి తన భార్యకు నెలకు రూ. 30,000, అతని మైనర్ కుమారుడికి నెలకు రూ. 15,000 భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారించింది. ఆమె అత్తమామల నుంచి భార్య విడిగా ఉండాలని పట్టుబట్టినట్లు కోర్టు గుర్తించింది. ‘‘భార్య ద్వారా వృద్ధాప్యంలో ఉన్న అత్తగారు లేదా అమ్మమ్మలకు సేవ చేయడం భారతదేశంలోని సంస్కృతి’’ అని కోర్టు పేర్కొంది. మనుస్మృతి గ్రంథంలోని కీలక వ్యాఖ్యాలను ఉటంకిస్తూ..‘‘ కుటుంబంలో స్త్రీ పట్టించుకోకపోతే, ఆ కుటుంబం త్వరగా నాశనం అవుతుందని, స్త్రీలు సంతృప్తిగా ఉన్న చోట కుటుంబం అభివృద్ధి చెందుతుంది’’ అని కోర్టు పేర్కొంది.
‘‘ ఏ లోకంలోనూ బ్రహ్మ స్త్రీ కంటే గొప్ప మణిని సృష్టించలేదు. ఆమె వాక్కు, చూపు, స్వర్శ, ఆలోచన మంచి అనుభూతులను ఇస్తుంది. అటువంటి మహిళ సంతానాన్ని, సంతోషాన్ని రెండింటిని పొందుతుంది. ఒక మహిళ కుటుంబంలో సంపద యొక్క దేవతగా చెప్పబడుతుంది, ఆమెను గౌరవంగా చూసుకోవాలి, ఆమె కోరికలను తీర్చాలి’’ అని బృహత్ సంహిత గ్రంథంలోని వ్యాఖ్యానాలను కోర్టు ప్రస్తావించింది. భారత రాజ్యాంగంలోని పార్ట్ IV-Aలోని ఆర్టికల్ 51-A ప్రకారం, భారత పౌరుడి ప్రాథమిక విధులు క్లాజ్ (ఎఫ్)లో.. మన గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వాలని, సంరక్షించాలని చెప్పబడిందని కోర్టు పేర్కొంది. భార్య, తన భర్త తల్లిదండ్రులు, అమ్మమ్మకు సేవ చేయడం, వారి నుంచి విడిగా జీవించాలనే అసమంజసమైన డిమాండ్లను నొక్కి చెప్పకూడదని కోర్టు పేర్కొంది.
కేసు వివరాలు:
పిటిషన్ పియాలీ రే ఛటర్జీ తన భర్త రుద్ర నారాయణ్ కట్నం కోసం డిమాండ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించాడని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింది మెయింటనెన్స్ పిటిషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ సుభాష్ చంద్ ధర్మాసనం విచారించింది. ఇదిలా ఉంటే తన తల్లిని, అమ్మమ్మను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పిటిషనర్ తనపై ఒత్తిడి తెచ్చినట్లు కేసులో భర్త పేర్కొన్నారు. తన భార్య తన డిమాండ్లు నెరవేర్చే దాకా భోజనం చేసేందుకు నిరాకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని అతను కోర్టు దృష్టికి తెచ్చాడు. అయితే, విచారణలో తన అత్తగారు(75), అమ్మమ్మకు సేవ చేయడం ఇష్టం లేకే భార్య ఇలాంటి వాదనలు తీసుకువచ్చిందిన కోర్టు గుర్తించింది. దీంతో విడిగా ఉండాలని భర్తపై ఒత్తిడి తీసుకువచ్చిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యొక్క సెక్షన్ 125(4) ప్రకారం..భార్య ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా భర్తతో కలిసి ఉండటానికి నిరాకరిస్తే భరణాన్ని తిరస్కరించడానికి అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.