Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After ‘Triple Talaq’: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో కుండపోత.. వరద గుప్పిట చెన్నై
మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఐదేళ్ల క్రితం బాధిత మహిళకు సల్మాన్ అనే వ్యక్తితో వివాహం అయింది. కొన్ని నెలల క్రితం సల్మాన్ చట్టవిరుద్దంగా ‘ ట్రిపుల్ తలాక్’ పేరుతో భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే ఓ మతగురువు సూచన మేరకు సల్మాన్ తన తమ్ముడిని పెళ్లాడి విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని భార్యకు చెప్పాడు. ఈ క్రమంలో సల్మాన్ తన భార్యను తన తమ్ముడు ఇస్లాంకు ఇచ్చి పెళ్లి జరిపించాడు.
అయితే సల్మాన్ చెప్పినట్లు ఆ మహిళ చేసిన తర్వాత.. అతని తమ్ముడు ఇస్లాం ఆమెకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించాడు. అన్నదమ్ములిద్దరూ పలుమార్లు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ స్థానిక కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు భర్త సల్మాన్ తో పాటు అతని సోదరుడు ఇస్లాం, మతగురువు గుడ్డు హాజీ, ముగ్గురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, ముస్లిం మహిళ వివాహహక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం కేసులు నమోదు చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.