Site icon NTV Telugu

Mumbai: తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి.. ఏం జరిగిందంటే..!

Mumbaiwomen

Mumbaiwomen

మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.

ముంబైలోని వెస్ట్ ఖార్‌కు చెందిన 24 ఏళ్ల నేహా గుప్తా, అరవింద్ గుప్తాకు నవంబర్ 16, 2024న వివాహం జరిగింది. ఇంకో కొద్ది రోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకోవాలి. కానీ ఇంతలోనే శవమైంది. అక్టోబర్ 16న రాత్రి నేహా గుప్తాను అత్తింటి వారు ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కానీ వెంటనే కొన్ని గంటల్లోనే రెండోసారి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఈసారి చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Doctor Death Case: వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా? వెలుగులోకి డెత్ మిస్టరీ

తొలి వివాహ వార్షికోత్సవం చేసుకోవడానికి సిద్ధపడుతున్న తరుణంలో కుమార్తె మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. నేహా గుప్తా అంతక ముందే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి బాగోలేదని.. విషం ఇస్తున్నారని.. భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని వాపోయింది. ఇంతలోనే నేహా గుప్తా చనిపోయినట్లు రావడంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త, అత్తమామల వేధింపులతో కుమార్తెను చంపేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, ఐదుగురు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై వరకట్న వేధింపులు, విషప్రయోగం, హత్య కింద కేసులు నమోదు చేశారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అరవింద్ గుప్తా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జన్మించి ముంబైలో బ్యాంకు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహం జరిగిన కొద్దికాలానికే నేహా గుప్తాపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తండ్రి రాధేశ్యామ్ గుప్తా పోలీసులకు తెలిపారు.

నేహా గుప్తా తండ్రి రాధేశ్యామ్ గుప్తా మాట్లాడుతూ.. తన అల్లుడికి రూ.28 లక్షల విలువైన బంగారం, రూ.9 లక్షల నగదు, గృహోపకరణాలు, బహుమతులు ఇచ్చినట్లు తెలిపాడు. ఖరీదైన బహుమతులను కట్నంగా పరిగణించలేదని.. ఎందుకంటే చట్టవిరుద్ధం కాబట్టి అలాగే ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. ఇవన్నీ ఇచ్చినా నిత్యం తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించారని వాపోయాడు. ఇంకా డబ్బు, ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఇవ్వాలని కోరినట్లు తెలిపాడు. అందుకు నిరాకరించడంతో వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. నేహా గుప్తాపై విషప్రయోగం జరిగిందని.. ఆహారంలో మాదకద్రవ్యాలు కలిపి ఉండటం వల్ల పదేపదే మూర్ఛపోయేలా చేశారని పేర్కొన్నాడు. చాలా సార్లు వింతగా, మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు కనిపించిందని వెల్లడించాడు. బలవంతంగా గర్భస్రావం కూడా చేయించారని చెప్పాడు.

Exit mobile version