Uddhav Thackeray: బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బావాన్‌కులే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ ఠాక్రేని ఒత్తిడి చేసింది, తమతో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో ఆయనకు 100 సీట్ల కన్నా ఎక్కువ వచ్చాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఎల్లప్పుడుూ మాతోశ్రీ(ఉద్ధవ్ ఠాక్రే నివాసం పేరు) దాని వారసత్వాన్ని గౌరవిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఠాక్రే అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్ తన రెబల్స్‌ని దించిందని ఆరోపించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన బవాన్‌కులే.. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని అన్నారు. ముస్లింల ఓటు బ్యాంక్ పార్టీ కాంగ్రెస్ అని, వారిని ఎప్పటికప్పుడూ పారద్రోలాలని, ముస్లిం సమాజాన్ని తమవైపు తప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బవాన్‌కులే అన్నారు.
Read Also: West Bengal: దుర్గాపూజా మండపాలపై దాడులు.. డీజీపీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు..
‘‘బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అమలులో ఉన్నా మహిళలకు, పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి కానీ కాంగ్రెస్ వారు పాలించిన రాష్ట్రాల్లో తమ పథకాన్ని నిలిపివేశారు. ఎన్నికల అనంతరం లడ్కీ బహిన్ పథకాన్ని నిలిపివేస్తామని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా, వచ్చే 5 ఏళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుంది’’ అని బవాన్‌కులే చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి( బీజేపీ- శివసేన షిండే-ఎన్సీపీ అజిత్ పవార్) కూటమి, మహా వికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఠాక్రే శివసేన- ఎన్సీపీ శరద్ పవార్) కూటమి పోటీలో ఉన్నాయి. నవంబర్ 20న రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.