Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మమతా బెనర్జీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆదివారం పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘రాష్ట్రంలో అరాచక వాతావరణ నెలకొందని, నేరాలకు ప్రసిద్ధి చెందిందని, ఈ గడ్డపై సందేశ్ ఖాలీ లాంటి ఘటనలు జరిగాయి. ఈ సారి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే సందేశ్‌ఖాలీ లాంటి ఘటనలు పునరావృతం చేసేందుకు ఎవరు ధైర్యం చేస్తారో చూస్తాం’’ అని అన్నారు. ఈడీ, సీబీఐ విచారణ కోసం ఇక్కడికి వస్తే టీఎంసీ గుండాలు దాడులు చేస్తారు, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అన్నారు.
అంతకుముందు, బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీకి చెందిన సువేందు అధికారి మాట్లాడుతూ.. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ప్రజల మద్దతు లేని గుండాల పార్టీ అని ఆరోపించారు. మేదినిపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్ అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. సీఎం మమతాబెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు, పరిపాలనను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీ ఘటన తర్వాత మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు, మహిళల పట్ల ఆమె నిజాయితీగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు.
Read Also: PM Modi: “ఎన్నికల్లో గెలవలేని వారు..” సోనియాగాంధీపై ప్రధాని కామెంట్స్..
లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ టీఎంసీ నేత షేక్ షాహహాన్ అతని మనుషులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో మహిళలు టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. దీంతో షేక్ షాజహాన్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. అయితే, కలకత్తా హైకోర్టు, గవర్నర్ కలుగజేసుకోవడంతో బెంగాల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా ఈడీ అధికారులపై దాడి కేసులో కూడా ఇతడు కీలక సూత్రధారిగా ఉన్నారు. ప్రస్తుతం ఇతడిపై ఉన్న కేసుల్ని సీబీఐ విచారిస్తోంది. మరోవైపు టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈసారి పశ్చిమ బెంగాల్‌లో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 42 ఎంపీ స్థానాలకు గానూ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అంతకన్నా ఎక్కువగా సాధించాలని అనుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.