Railway Budget: భారతదేశ చరిత్రలో ‘‘రైల్వే బడ్జెట్’’కు ఘన చరిత్ర ఉండేది. అయితే, 2017లో దీనిని కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయడం ద్వారా 92 ఏళ్ల పురానత అధ్యాయనానికి తెరపడింది. బడ్జెట్ మరింత సరళంగా, ఆచరణాత్మకంగా ఉండాలనే ఆలోచనతో రైల్వే బడ్జెట్ విలీనం జరిగింది. 2017-18లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారిగా సంయుక్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఎందుకు విలీనం చేశారు.?
నీతి ఆయోగ్ సభ్యులు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ రైల్వే బడ్జెట్ రద్దుకు సిఫారసు చేసింది. దశాబ్ధాల ఆచారానికి ముగింపు పలకడానికి దేబ్రాయ్, కిషోర్ దేశాయ్‌ల సిఫారసు పత్రాన్ని అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రభుత్వానికి సమర్పించారు. రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేసే అంశాన్ని సురేష్ ప్రభు, అరుణ్ జైట్లీలు పార్లమెంట్‌లో లేవనెత్తారు. దీని తర్వాత రెండు బడ్జెట్లను కలిపేశారు.
రెండు బడ్జెట్లను వేరు వేరుగా చూపడం కన్నా, ఒకే బడ్జెట్‌గా చూపితే మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టంగా తెలుస్తుందని ప్రభుత్వం భావించింది. మునుపటిలా రైల్వే ఖర్చులు వేరు, ప్రభుత్వ వ్యయాలు వేరు అని కాకుండా అన్ని ఆదాయాలు, వ్యయాలు ఒకే సీన్‌లో కనిపిస్తాయి. బడ్జెట్ విలీనం తర్వాత రైల్వేలు, రహదారులు, జలమార్గాలు ఈ మూడింటి మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. దీని ద్వారా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ లను సమర్థవంతంగా రూపొందించే అవకాశం ఏర్పడింది.
రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో లాగే స్వతంత్రంగా పనిచేస్తుంది. అయితే బడ్జెట్ లో భాగంగా ప్రత్యేక బడ్జెట్ అంచనాలు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అందుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ కోసం అప్రాప్రియేషన్ బిల్లు తయారు చేస్తుంది. ఇది అన్ని సంబంధిత శాఖల పనులను నిర్వహిస్తుంది. దీనికి అదనంగా రైల్వేలు ప్రభుత్వానికి డివిడెంట్లు చెల్లించాల్సిన అవసరం లేదు, మూలధన బకాయిలు కూడా రద్దు చేయబడ్డాయి.
