Site icon NTV Telugu

Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

బీజేపీ ఎవరినైనా మింగే మొసలి, కొండచిలువ లాంటిదని అన్నారు. దానితో వెళ్తే ఇక అంతే సంగతులంటూ వ్యాఖ్యానించారు. 2019 మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావిస్తూ.. బీజేపీ, శివసేన విభేదాల కారణంగా శివసేన ఆ పార్టీకి దూరంగా ఉండాలని అనుకుందని, శివసేనను ఖతం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని సంజయ్ రౌత్ విమర్శించారు. బీజేపీతో అంటకాగుతున్న పార్టీలను అంతం చేయాలని అనుకుంటుందని అన్నారు. ఇప్పుడు శివసేనలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు విషయాన్ని గుర్తిస్తున్నారని, ఇలాంటి మొసలికి దూరం కావడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Read Also: Sai Dharam Tej: చక్రవ్యూహం ట్రైలర్ లాంచ్ చేసిన సుప్రీమ్ హీరో

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చాలా అశాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాట నిలబెట్టుకోవడం లేదని, శివసేన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని, పైగా వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీంతోనే మహారాష్ట్ర, పార్టీ గౌరవం కోసం ఉద్ధవ్ ఠాక్రే ఆ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు.

2019 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన మెజారిటీ సీట్లను సాధించింది. అయితే సీఎం శివసేనకు కావాలని పేచీ పెట్టడంతో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా ‘మహావికాస్ అఘాడీ’ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత గతేడాది ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో మళ్లీ మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Exit mobile version