NTV Telugu Site icon

Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్ ఎవరు..? పాకిస్తాన్ చేతికి ఎలా చిక్కాడు..? ఈ విషాదగాథ వివరాలు..

Sarabjit Singh

Sarabjit Singh

Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్ విషాదగాథ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన పాపానికి గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం అతడిని నిర్భందించింది. చివరకు 22 ఏళ్లు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్షను అనుభవించాడు. 49 ఏళ్ల వయసులో పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర సర్ఫరాజ్, ఇతర ఖైదీలు తీవ్రంగా దాడి చేయడంతో మరణించాడు. అతడి కోసం భారత ప్రభుత్వంతో పాటు అతడి సోదరి దల్బీర్ కౌర్ ఎంతో పోరాటం చేసినా, చివకు శవంగా ఇండియాకు తిరిగి వచ్చాడు.
Read Also: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్‌ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”..

సరబ్‌జీత్ సింగ్ ఎవరు..?

పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తరన్ జిల్లా బిఖివింద్ గ్రామంలో జన్మించాడు. ఇది ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది.  సరబ్జీత్‌కి వ్యవసాయం వృత్తిగా ఉండేది. సుఖ్‌ప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇతడికి ఇద్దరు కుమార్తెలు స్వపన్ దీప్, పూనమ్ కౌర్ ఉన్నారు. ఇతని అక్క దల్బీర్ కౌర్ 1991 నుంచి 2013 వరకు సరబ్జీత్ మరణించే వరకు అతని విడుదల కోసం పోరాడారు.

పాకిస్తాన్ ఎలా చేరాడు.? ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు..?

మద్యం తాగి మత్తులో సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లినట్లు సరబ్జీత్ సింగ్ ఫ్యామిలి చెబుతోంది. ఇలా వెళ్లిన సమయంలో అక్కడి అధికారులకు చిక్కాడు. అదే సమయంలో 1990లో పాకిస్తాన్‌లో లాహోర్ మరియు ఫైసలాబాద్‌లలో జరిగిన పేలుళ్లలో 14 మంది మరణించారు. ఈ ఘటనలో అతడి ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై అతడికి అక్కడి న్యాయస్థానాలు మరణశిక్ష విధించాయి.

అయితే, ఈ పేలుళ్లు జరిగిన నెల తర్వాత అనుకోకుండా ఇండియా-పాక్ సరిహద్దును దాటినట్లు భారత్ ప్రకటించింది. కానీ వీటన్నింటిని పాకిస్తాన్ పట్టించుకోలేదు. 1990 ఆగస్ట్ 29న అతను పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. 1991లో అతడికి మరణశిక్ష విధించారు. ఈ సంఘటన అప్పట్లో భారత్‌లో సంచలనం సృష్టించింది. ఇతని తరుపున వాదించిన లాయర్లు ఎన్నోసార్లు క్షమాభిక్ష పెట్టాలని పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఏదీ ఆమోదించబడలేదు. సరబ్జీత్ సింగ్‌ని మంజిత్ సింగ్ మట్టు అని పాకిస్తాన్ ఆరోపించింది. గూఢచర్యం చేసినందుకు దోషిగా నిర్ధారించింది.

 

జైలులో దాడి, ఆపై మరణం:

ఈ రోజు లాహోర్‌లో గుర్తుతెలియన వ్యక్తుల చేతిలో హతమైన అమీర్ సర్ఫరాజ్, ఇతర ఖైదీల చేతిలో సరబ్‌జీత్ సింగ్ దాడికి గురయ్యాడు. చంపాలన్న ఉద్దేశ్యంతోనే అతడిపై దాడి జరిగినట్లు ఆ తర్వాత శవపరీక్షల్లో తేలింది. దాడికి పాల్పడిన సర్ఫరాజ్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కి అత్యంత సన్నిహితుడు. సరబ్ జీత్ తలపై పదునైన మెటల్ షీట్లు, ఇనుప రాడ్లు, బ్లేడ్లు, ఇటుకలతో దాడి చేశారు. అతని మెదడుకు తీవ్రగాయాలయ్యాయి. వెన్నముక విరిగిపోయి కోమాలోకి వెళ్లాడు. లాహోర్‌లో జిన్నా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అతను కోలుకునే అవకాశం లేదని వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో అతని సోదరి, భార్య సరబ్ జీత్‌ని చూసేందుకు పాకిస్తాన్ వెళ్లారు. అతను కోమా నుంచి కోలుకోలేడని వైద్యులు చెప్పడంతో భారత్ తిరిగి వచ్చారు.

అయితే, ఏప్రిల్ 29, 2013న, మానవతా దృక్పథంతో సరబ్ జీత్‌ని విడుదల చేయాలని, వైద్యం కోసం భారత్‌కి పంపాలని ప్రభుత్వం పాకిస్తాన్‌కి విజ్ఞప్తి చేసింది. కానీ పాకిస్థాన్ పదే పదే అభ్యర్థనలను తిరస్కరించింది. దాడి జరిగిన ఆరు రోజుల తర్వాత మే 1, 2013లో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు.

భారత్ తీసుకువచ్చిన తర్వాత అతడి మృతదేహాన్ని పరిశీలిస్తే చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగినట్లు తేలింది. శరీరం నుంచి గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలను పాకిస్తాన్ తొలగించింది. తొలి శవపరీక్షలోనే ఇవి తొలగించి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం ప్రకారం తలకు తీవ్రగాయం కావడం, అంతర్గత రక్తస్రావం జరిగిందని, సరబ్ జీత్ పుర్రెపై 5 సెంటీమీటర్ల వెడల్పు గాయం అతని మరణానికి కారణమైందని తెలుసింది.

ఒకానోక దశలో విడుదల అవుతున్నాడనే ఆశ:

జూన్ 27, 2012లో అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వశాఖ పంపిన పత్రంపై సంతకం చేశాడు. పాక్ నిబంధనల ప్రకారం జీవితఖైదు 14 ఏళ్లు, అప్పటికే 22 జైలులో గడిపిన సరబ్‌జీత్ సింగ్ విడుదలవుతున్నారనే వార్తతో ఆయన స్వగ్రామంలో భారీగా వేడుకలు జరిగాయి.

అయితే, విడుదలయ్యే ఖైదీ పేరు సరబ్ జీత్ సింగ్ కాదని, సుర్జీత్ సింగ్ అని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. గూఢచర్యం ఆరోపణలపై ఈ సుర్జీత్ సింగ్‌ని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే, భారత్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. సుర్జీత్ సింగ్, సరబ్‌జీత్ సింగ్‌కి ఒకే రకమైన ఉర్దూ స్పెల్లింగ్స్ ఈ గందరగోళానికి కారణమయ్యాయి.

Show comments