Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఈసీ, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రస్తుతం బారామతి ఎంపీగా ఉన్న సుప్రియా సులేపై అజిత్ పవార్ సునేత్ర పవార్‌ని పోటీలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బారామతి వ్యాప్తంగా సునేత్రా పవార్ పోస్టర్లు ఈ పోటీని స్పష్టం చేస్తున్నాయి. 2024 ఎంపీ ఎన్నికల్లో సునేత్ర బారామతి నుంచి పోటీ చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన కజిన్ సుప్రియా సూలేని ఓడించేందుకు అజిత్ పవార్ పావులు కదుపుతున్నారు. సునేత్ర పేరును నేరుగా వెల్లడించకుండా.. ఈ సారి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ‘‘ఫస్ట్ టైమర్’’ని ఎన్నుకోవాలని బారామతి ఓటర్లను ఆయన వేడుకున్నారు. 5 దశాబ్ధాలుగా బారామతి ఎన్సీపీ, పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది.
మరోవైపు ఈ పోటీపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. నియోజకవర్గంలో ప్రజలను భావోద్వేగానికి గురిచేయడానికి అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుటుంబంలో తాన ఒంటరయ్యానని చెప్పడం ద్వారా అతను ప్రజల్ని భావోద్వేగానికి గురిచేస్తున్నాడని విమర్శించారు.
సునేత్ర పవార్ ఎవరు..?
సునేత్ర పవార్ అజిత్ పవార్ భార్యగా, బారామతిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఎన్విరాన్మెంట్ ఫోర్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఆమె శరద్ పవార్‌కి అత్యంత సన్నిహితుడైన పదమ్ సిన్హ్ పాటిల్ సోదరి. ఇదే కాకుండా సునేత్రా సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించడానికి విస్తృతంగా పనిచేశారు. ప్రముఖ విద్యాసంస్థ విద్యా ప్రతిష్టాన్‌కి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు ఆమె బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక నాయకులతో టచ్‌లో ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో సుప్రియా సూలేపై బీజేపీ తరుపున పోటీ చేసిన కంచన్ కుల్ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
55 ఏళ్లుగా బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. శరద్ పవార్ 1967లో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి గెలుపొందారు. 1972, 1978, 1980, 1985 మరియు 1990 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1984, 1996, 1998, 1999, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత విజయం సాధించారు.
