Site icon NTV Telugu

Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రధానమంత్రిని సంయుక్తంగా ప్రకటిస్తామని ఈ రోజు చెప్పారు. 2004లో ఇండియా షైనింగ్ అని నినదించిన బీజేపీకి 2024లో కూడా అదే గతి పడుతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి, వాటిని రక్షించే వారికి మధ్య జరుగున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశంలోని మెజారిటీ ప్రజల కోసం పనిచేస్తామని, భారత్ అనేది ఒకరు, ఇద్దరికి చెందినది కాదని ఆయన అన్నారు. మనదేశం గుత్తాధిపత్యం ఉన్న దేశం కాదని, వ్యాపారంలో సరసమైన పోటీ ఉన్న దేశమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సైద్ధాంతిక ఎన్నికల్లో పోరాడాలని ఇండియా కూటమి నిర్ణయించిందని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎవరు ప్రధాని అనేది, మొత్తం అన్ని పార్టీలు కలిసి సంయుక్తంగా నిర్ణయిస్తాయని చెప్పారు. మీడియా చెబుతున్నట్లు దాని కంటే ఇది చాలా దగ్గరి పోటీ కలిగిన ఎన్నికలని ఆయన అన్నారు.

Read Also: Hema Malini: బీజేపీ మధుర అభ్యర్థి హేమమాలిని ఆస్తులెంతో తెలుసా..?

2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియా షైనింగ్ అనే ప్రచారం జరిగిందని, ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందని గుర్తు చేశారు. ఆనాటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దానికి భిన్నమైనవని అన్నారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను నిలిపేశారని, ఇప్పుడు ప్రజలతో వెళ్లడమే తమకు మిగిలిందని చెప్పారు. ‘న్యాయ్ పాత్ర’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో విడుదల చేశారు. ఇది ఐదు ‘పిల్లర్స్ ఆఫ్ జస్టిస్’ మరియు వాటి క్రింద 25 హామీలపై దృష్టి పెట్టింది.

Exit mobile version