కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. మే 14 నుంచి గోధుమల ఎగుమతులను తక్షణమే నిలపివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.
అయితే ఈ ఉత్తర్వుల కన్నా ముందు ఎగుమతుల కోసం అనుమతులు ఉంటే అనుమతించబడుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. అదే విధంగా ఆహర భద్రత అవసరాలను తీర్చేందుకు ఇతర దేశాలకు భారత ప్రభుత్వం మంజూరు చేసిన గోధుమల ఎగుమతులు అనుమతించబడుతాయని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా, పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉల్లి విత్తనాల ఎగుమతి విధానాన్ని కూడా రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకువచ్చారు. ఇది తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వుల్లో పేర్కొంది డీజీఎఫ్టీ.
అంతర్జాతీయంగా ఇటీవల ఒక్కసారిగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాల కారణంగా వీటి ధరలు పెరుగుతుందడటంతో ఇండియా ముందుగానే గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా గోధుమలు ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింది. దీంతో పలు దేశాల్లో గోధుమల డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను 300 శాతం పెంచింది.