NTV Telugu Site icon

Shimla Mosque Row: మసీదుని కూలిస్తే బీజేపీకి, కాంగ్రెస్‌కి తేడా ఏంటి..? కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత..

Shimla Mosque Row

Shimla Mosque Row

Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్‌కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. నిన్న పెద్ద ఎత్తున ప్రజలు, హిందూ సంస్థలు, బీజేపీ ఆందోళన నిర్వహించింది.

Read Also: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష

ఇదిలా ఉంటే, మసీదు నిర్మాణం రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలోనే నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రషీద్ అల్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మసీదును కూల్చివేస్తే బీజేపీకి, కాంగ్రెస్‌కి తేడా ఏమిటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన సంజౌలి మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న వారిపై కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు.

మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదని, ప్రభుత్వంలోని ఒక మంత్రి కూడా అది వక్ఫ్ బోర్డు స్థలమే అని చెప్పడాన్ని రషీద్ అల్వీ ప్రస్తావించారు. ఇది పాత మసీదు, దీనిని కూల్చివేసే ప్రశ్నే లేదని చెప్పారు. అంతకుముందు సభలో మాట్లాడిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ , సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. వారు అనుమతి లేకుండా నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. మసీదుని తెరవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారా..? అని అడిగారు. సమస్యపై విచారణ జరిపిస్తున్నామని, ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు.

Show comments