NTV Telugu Site icon

Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?

Jammu Kashmir

Jammu Kashmir

Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత వరసగా కథువా, దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా.. ఒక జవాన్ అమరుడయ్యారు.

అయితే, ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్న జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి. రిటైర్డ్ ఆర్మీ అధికారుల ప్రకారం.. ప్రధానిమోడీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్(రిటైర్డ్) అన్నారు. 2000లో జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని చిట్టి సింగ్ పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపిన అంశాన్ని ఉదహరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు.

Read Also: Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు కదలిక.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..

మోడీ మరోసారి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తన ప్రభుత్వ విజయాలను చెబుతున్న సందర్భంలోనే, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు బాగా లేవని చూపించాలని శత్రుదేశం పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు విజయవంతగా ముగిసిన తర్వాత, మళ్లీ ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది. ఆర్మీ ఆపరేషన్ల వల్ల గత కొంత కాలంగా ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు. కాశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో పోలిస్తే ఉగ్రదాడుల భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్నచిన్న గ్రూపులు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నాయి. వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ‘‘జింగిల్ వార్‌ఫేర్’’లో ఆరితేరారు. అడవుల్లో రోజుల పాటు మకాం వేసి, గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దానికి ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు.