దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలు ఎంతో అవసరం.. దేశాన్ని రక్షించేందుకు బోర్డర్‌కు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నవారే.. ఇప్పుడు దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.. ఆర్మీలో చేరడమే మా కల.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం అంటున్న అభ్యర్థులు.. ఆందోళనకు దిగి విధ్వంసమే సృష్టించారు.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, అగ్గి రాజేసింది మాత్రం అగ్నిపథ్ పథకమే అని చెప్పాలి.. సైన్యం రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ, ‘అగ్నిపథ్’ పేరిట కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాని ప్రకారం 17-21 ఏళ్ల మధ్య వయసున్న వారిని నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వేతనంతో నియమిస్తారు. వారికి అగ్ని వీరులు అని పిలుస్తూ 6 నెలల పాటు రక్షణ వ్యవహారాల్లో శిక్షణ ఇస్తారు. అయితే, వారికి ఇచ్చే వేతనంలో మూడో వంతు మొత్తాన్ని కార్పస్ ఫండ్‌కు మళ్లించేలా ప్లాన్ చేశారు.. దీంతో.. మొదటి ఏడాది నెలకు రూ. 20 వేలు మాత్రమే వేతనంగా కొత్త సైనికులకు అందనుంది.
అంతేకాదు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత ఎంపికైన వారిలో 25 శాతం మందిని మాత్రమే రక్షణ శాఖలో కొనసాగించి మిగిలిన 75 శాతం మందిని ఇంటికి పంపించేలా అగ్నిపథ్ పథకంలో మెలిక ఉందనే ఆందోళన నెలకొంది.. కార్పస్‌లో వారు దాచుకున్న సొమ్ముకు సమాన మొత్తాన్ని ప్రభుత్వం కలిపి వన్‌టైమ్ బెనిఫిట్ కింద రూ.11- 12 లక్షల వరకు చెల్లిస్తారు. పెన్షన్, గ్రాట్యుటీ లేదా ఇంకే ఇతర బెనిఫిట్స్ ఉండబోవు.. అంటే.. అక్కడితో వారికి ప్రభుత్వంతో సంబంధం తెగిపోయినట్టే.. ఇదే ఇప్పుడు అగ్గిరాజేసినట్టు అయ్యింది.. కరోనా పుణ్యమా? ఇతర కారణాలు ఏవైనా.. గత రెండేళ్లుగా సైన్యంలో రిక్రూట్‌మెంట్ లేకుండా పోయింది.. అయితే, సైన్యంపై ఖర్చును తగ్గించుకోవాలనే ఒకే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పథకం తీసుకొచ్చారనే విమర్శలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.
టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ (టీవోడీ)గా పిలిచే ఈ పథకాన్ని ఎక్కడా పరీక్షించలేదనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి.. పైలట్ ప్రాజెక్టు కూడా లేకుండా.. నేరుగా అమలు చేయడం అభ్యంతరాలకు తావిచ్చినట్టు అయ్యింది.. నైతిక విలువలు, నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం లేదని పలువురు విశ్రాంత సైన్యాధికారులు విమర్శిస్తున్నారు.. అంతేకాదు, ఇండియన్ ఆర్మీ సామర్ధ్యంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సైనిక దళాలను ఆర్థిక కోణంలో చూడొద్దు, ఖజానాకు ఆదా చేసిన డబ్బు నుంచి సైనిక జీవితం, వృత్తిని అంచనా వేయలేం అంటున్నారు. టీవోడీ స్కీమ్ సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. ప్రతీ సంవత్సరం 40 వేల మంది వరకు ఆర్మీ నుంచి బయటకు పంపించే కార్యక్రమంగా ఉంటుంది.. ఉన్నట్టుండి ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడడం ఖాయమనే వాదనసైతం వినిపిస్తోంది. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక, టీవోడీ విధానం పుట్టిన అమెరికాలో దీనిపై ప్రతీకూల అధ్యయనాలు ఉన్నాయి.. మాజీలైన సైనికులు ఇళ్లు, వాకిళ్లు లేక నేరస్తులుగా స్థిరపడిపోతున్నారని అనేక అధ్యయనాలు బహిర్గతం చేశాయి.. మొత్తంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై అభ్యర్థుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.. ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.. ఆ పథకంతో కేంద్ర ప్రభుత్వం తమని మోసగించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విధ్వంసానికి దిగారు.. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాం..? ఈ కొత్త పథకంతో మాకు ఎంతో నష్టం అని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. సైన్యంలో చేరినవారు లేదా చేరాలనుకునేవారు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యేది వారి దేశభక్తి, చైతన్య స్ఫూర్తితోపాటు తమకేమైనాగాని తమ కుటుంబానికి ఏ లోటూ లేనివిధంగా సర్కారు ఆదుకుంటుందన్న భరోసా ఉంటుంది.. కానీ, కొత్త విధానంతో దానికి తూట్లు పొడిచారని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అగ్నిపథ్ పూర్తిగా వెనక్కితీసుకోవాలని.. పాతపద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు..
ఓవైపు ఆందోళనలు జరుగుతున్నా.. విధ్వంసం జరిగినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.. ఇదే సమయంలో.. త్వరలోనే అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్‌మెంట్ అంటూ కేంద్రం, ఆర్మీ అధికారులు ప్రకటించారు. దీంతో.. ఈ పథకం విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే, నేడు త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ భేటీలో ప్రధానంగా అగ్నిపథ్ పథకంపై సమీక్ష నిర్వహించబోతున్నారు. అగ్నిపథ్ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా అలజడి నెలకొన్ని నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరి సర్కార్ ఎలా ముందడుగు వేస్తుంది..? ఆర్మీ అభ్యర్థులు వెనక్కి తగ్గుతారా? లేక కేంద్రమే కొన్ని మార్పులు చేయనుందా? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.