NTV Telugu Site icon

PM Modi Russia Visit: మోడీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ.. క్రెమ్లిన్ కామెంట్స్..

Pm Modi, Putin

Pm Modi, Putin

PM Modi Russia Visit:ప్రధాని నరేంద్రమోడీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మిత్రదేశం రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. జూలై 8 నుంచి 9 వరకు ప్రధాని మాస్కోలో ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీల మధ్య ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి.

Read Also: Bear Grylls: “బేర్ గ్రిల్స్” వీడియోలు రక్షించాయి.. అగ్నిపర్వతం నుంచి బయటపడిన సోదరులు..

ఇదిలా ఉంటే మోడీ రష్యాలో పర్యటించడాన్ని చూసి వెస్ట్రన్ దేశాలు అసూయ పడుతున్నాయని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోలో ప్రధాని మోడీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరువురు నేతలు అనధికారికంగా చర్చలు జరపొచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీజటీఆర్కే టీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని, క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు విడిగా చర్చించుకోవడంతో పాటు, ప్రతినిధులతో కూడిన చర్చలు రెండూ జరుగుతాయని ఆయన అన్నారు. ఇది భారత, రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా పెస్కోవ్ అభివర్ణించారు. ప్రధాని మోడీ రాకను పశ్చిమ దేశాలు నిశితంగా, అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ అన్నారు. దాదాపుగా ఐదేళ్ల క్రితం 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సమావేశానికి ప్రధాని రష్యాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చివరిసారిగా 2021లో భారత్‌ని సందర్శించారు.