West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బెంగాల్ లోని మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నా.. హింసకు అడ్డుకట్టపడటం లేదు.
Read Also: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్ లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ని కాల్చి చంపారు. మరో సంఘటనలో సీపీఎం కార్యకర్త కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, 24 పరగణ జిల్లాల్లో కూడా హింస చెలరేగింది. రిజినగర్, తుఫాన్ గంజ్, కాగ్రమ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు. 24 పరగణ జిల్లాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బూల్ ఏజెంట్ చంపబడ్డాడు. ఈ హత్య వెనక టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీజేపీతో పాటు సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీల మధ్య తీవ్ర హింస చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రోజు మరణాలకు ముందు 12 పైగా మంది కార్యకర్తలు పలు జిల్లాల్లో జరిగిన దాడుల్లో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 20కి పైగా చేరాయి. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివీ ఆనంద్ బోస్ పంచాయతీ ఎన్నికలను పరిశీలించేందుకు 24 పరగణ జిల్లాకు వెళ్లారు.