West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన ఓ దాడి ఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు షేక్ అబ్దుల్ హఫీజ్ ఇంటిపై కార్యకర్తలు దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పష్టం చేశారు. కేసులో ఉన్నవారు నేరస్తులే అని, వారితో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు.
సీజేపీ సభ్యుడు షేక్ అబ్దుల్ హఫీజ్ జూలై 19 ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అంశంపై నిరసనల్లో పాల్గొన్నారు. ఆగస్టు 13న ఆయన సీజేపీ చేపట్టిన ‘‘ఫిక్స్ ది స్కూల్’’ కార్యక్రమంలో భాగంగా కరీషుండా ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు. అక్కడ మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నించారు. అదే రాత్రి కొందరు వ్యక్తులు ఇనుప రాడ్లు, కర్రలతో హఫీజ్ ఇంట్లోకి చొరబడిన ఆయనపై దాడి చేశారని కుటుంబీకులు ఆరోపించారు. తన కుమారుడి కాపాడే ప్రయత్నంలో హఫీజ్ తండ్రి మహమ్మద్ మాఫిక్ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఇద్దరి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని వస్తుండగా, మరోసారి దాడి జరిగినట్లు ఆరోపించారు.
సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడి వెనక బీజేపీ ఉందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సీజేపీ కార్యకర్తలు బంకురాకు వెళ్లి పోరాడతారని ఆయన ప్రకటించారు. ఈ ఆరోపణలపై బీజేపీకి సంబంధం లేదని సీఎం చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

