Site icon NTV Telugu

UP: ఇదేం విడ్డూరం! మొరిగిన కుక్క.. ఆగిన పెళ్లి!

Upwedding

Upwedding

ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు కుక్క కారణంగా అర్ధాంతరంగా పెళ్లి పీటల మీద వివాహం ఆగిపోయింది. పెళ్లి వేడుక కాస్త రణరంగం మారి రక్తపాతం చిందించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే…!

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలోని వివాహ మండపంలో పెళ్లి జరుగుతోంది. ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో జరుగుతోంది. బుధవారం రాత్రి చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు జరిగాయి. వధువు తరపు వారు ప్రయాగ్‌రాజ్ నుంచి విమానంలో చేరుకున్నారు. వరుడి తరపు వారు చాలా గ్రాండ్‌గా ఊరేగింపుతో మండపానికి తీసుకొచ్చారు. ప్రారంభం అంతా ప్రశాంతంగా వేడుకలు జరుగుతున్నాయి. జైమాల వేడుక కూడా చాలా సంతోషంగా పూర్తైంది. ఇరు కుటుంబాలు ఆనందోత్సహాలతో సాగిపోతున్నారు.

ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముహూర్తానికి పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సమయంలో నగలు సమర్పించే ఆచారం జరుగుతోంది. ఇంతలో మండపానికి సమీపంలో కట్టి ఉంచిన వధువుకు సంబంధించిన పెంపుడు కుక్క మొరగడం ప్రారంభించింది. దీంతో వరుడి కుటుంబానికి చెందిన యువకుడు ఆవేశంలో కొట్టడంతో కుక్క చచ్చిపోయింది. అంతే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అప్పటిదాకా ఉల్లాసంగా… ఉత్సాహం సాగిన వేడుక కాస్త రణరంగంగా మారిపోయింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు కర్రలు, కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో వధువుకు సంబంధించిన ముగ్గురు బంధువులు, వరుడికి సంబంధించిన ఇద్దరు బంధువులు గాయపడ్డారు.

ఈ కొట్లాట జరుగుతుండగా ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా మండపానికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింప జేశారు. కానీ ఈ పరిణామంతో వధువు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చుకునేందుకు ఒప్పందం కుదరడంతో పంచాయితీ సద్దుమణిగింది. అనంతరం ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు.

వరుడు మాట్లాడుతూ.. చాలా రోజులుగా ప్రేమలో ఉన్నామని.. తల్లిదండ్రులను వదిలి అమ్మాయి మా ఇంటికి వచ్చిందని తెలిపాడు. కాన్పూర్ ఆర్య సమాజ్‌లో వివాహం కూడా చేసుకున్నామని వెల్లడించాడు. అమ్మాయి బంధువులు వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో తాము గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పాడు. దండల కార్యక్రమం కూడా సజావుగా సాగిందని.. తెల్లవారుజామున వివాహ ఆచారాల సమయంలో కుక్కను చంపడంతో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నాడు. పెళ్లి వద్దంటూ అమ్మాయి ప్రయాగ్‌రాజ్ వెళ్లిపోయిందని చెప్పాడు.

Exit mobile version