పెళ్లి అంటేనే సందడి.. ఇక, వివాహ తంతు తర్వాత బరాత్ ఉండాల్సిందే.. బంధువులతో పాటు పెళ్లి కొడుకు స్నేహితులు రచ్చ చేయడం చేస్తుంటాం.. ఎప్పుడో సాయంత్రానికి స్టార్ట్ చేసి.. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వదలని సందర్భాలు అనేకం.. ఇక, రోజురోజుకీ బరాత్ కొత్త పుంతలు తొక్కుతోంది.. బ్యాండ్, బాణాసంచా, లైటింగ్, మ్యూజిక్ సిస్టమ్… ఇలా తమ రేంజ్‌ను బట్టి హంగామా చేస్తున్నారు. ఇది చాలా మందికి ఇబ్బందిగా అనిపించినా.. కొందరి ఆనందం కోసం భరించక తప్పని పరిస్థితి.. అయితే, తాజాగా.. ఓ పౌల్ట్రీ ఫారమ్ యజమాని పోలీసులను ఆశ్రయించారు.. పెళ్లి బాజాలతో, బాణాసంచా మోతలతో తన ఫారమ్‌లో కోళ్లకు గుండెపోటు వచ్చిందని.. కొన్ని చనిపోయాయని ఫిర్యాదు చేశారు..
Read Also: సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి.. బీజేవైఎం పనే..
ఒడిషాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంజిత్ కుమార్ పరిదా అనే వ్యక్తి పౌల్ట్రీ ఫారమ్‌కి కొద్ది దూరంలో పెళ్లి బాజాలతో బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున వివాహ ఊరేగింపు జరిగింది.. పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టి రచ్చ చేశారట.. చెవులు చిల్లులు పడేంత భారీ శబ్దంతో చిందులేశారని.. కొందరు మ్యూజిక్ సౌండ్ తగ్గించమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు.. దీంతో తన కోళ్ల ఫారమ్‌లోని 63 కోళ్లు చనిపోయాయని.. కోళ్లు గుండెపోటుతో మృతిచెందినట్టు పశువైద్యుడు నిర్ధారించినట్టు పేర్కొన్న రంజిత్.. పరిహారం ఇవ్వాలని పెళ్లి వారిని సంప్రదించినా.. వారు నిరాకరించారని.. దీంతో పోలీసులకు ఆశ్రయించినట్టు తెలిపారు.. అయితే, కేసు నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసులు.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడంతో.. వాళ్లు మాట్లాడుకోవడం.. సమస్య పరిష్కారం కావడం జరిగిపోయాయట.