Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రాహుల్ గాంధీని ఎగతాళి చేశారు. ఎక్స్(ట్విట్టర్)లో.. ‘‘ఎన్నికల సమయంలో మాకు రాహుల్ గాంధీ కావాలి బ్రదర్’’ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్వీట్‌కి రిఫ్లై ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Read Also: Pindam OTT: థియేటర్లలో వణికించిన ‘పిండం’ ఇప్పుడు మీ ఇంటికే వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?
‘‘లోక్‌సభ ఎన్నికల కోసం హిమంత బిస్వా శర్మా ఎందుకు వేచి ఉండాలి? రాహుల్ గాంధీ జీ చట్టాన్ని ఉల్లంఘిస్తే, మీరు ఎందుకు ముందుకు వెళ్లి అవసరమైన పని చేయకూడదు? మీరు అలా చేయరు, ఎందుకంటే అతను మాట్లాడుతున్నది పూర్తిగా నిజమని మీకు తెలుసు. మీరు మణిపూర్ రాష్ట్రంలో మీ పొరుగువారికి అండగా నిలబడలేదు. రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను ప్రతిధ్వనిస్తున్నాడు. ఇది మిమ్మల్ని భయపెడుతోంది’’ అంటూ ప్రియాంక్ ఖర్గే ఎక్స్‌లో రాశారు.
యాత్ర సందర్భంగా అస్సాంలో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తామని హిమంత అన్నారు. దీనిపై ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అస్సాం పోలీసులు ఇప్పటికే ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడం గమనార్హం.