Wayanad: వయనాడ్‌లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్

  • వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం
  • నలుగురు మృతి.. పలువురికి గాయాలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Kerala

Kerala

వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. 2024లో మాదిరిగా విరుచుకుపడ్డాయి. పట్టపగలే ప్రకృతి ప్రకోపం చూపించింది. కళ్ల ముందే కొండచరియులు దూసుకు రావడాన్ని గమనించి ప్రజలు పరుగులు పెట్టారు. అయినా కూడా ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

మంగళవారం కల్లాడి సమీపంలోని మీనాక్షి బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అనక్కంపోయిల్–కల్లాడి–మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాల మధ్య రాకపోకలను మెరుగుపరచడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

వైరల్ అయిన సీసీటీవీ వీడియోలో మొదట నిర్మాణ ప్రాంతంలో కొందరు వ్యక్తులు నిలబడి ఉండగా.. ఒక్కసారిగా కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు దూసుకొచ్చాయి. పరిస్థితిని గమనించిన వారు వెంటనే ప్రాణాల కోసం పరుగులు తీశారు. కొందరు తృటిలో తప్పించుకోగా.. మరికొందరు మట్టిపెళ్లల కింద పడిపోయారు. కొండచరియల ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండటంతో అక్కడ ఉన్న ఒక ట్యాంకర్ లారీని కూడా అనేక మీటర్ల దూరం వరకు తోసుకెళ్లింది. వీడియోలో అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యంగా.. ఒక దంపతులు, మరో వ్యక్తి కొండచరియల ధాటికి నేలకూలిపోయి మట్టిలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. కొద్ది క్షణాల పాటు వారి పరిస్థితిపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. దుమ్ము తగ్గిన తర్వాత ముగ్గురూ లేచి నడుచుకుంటూ బయటపడటం కనిపించింది. ఈ దృశ్యం చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనతో వయనాడ్‌లోని పర్యావరణపరంగా సున్నితమైన, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా అనక్కంపోయిల్–కల్లాడి–మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు పశ్చిమ కనుమల సున్నిత ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో పర్యావరణ వేత్తలు గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ముఖ్యమంత్రి సతీశన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఇక సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.