Site icon NTV Telugu

Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Up

Up

Samajwadi MLA Thrashes BJP Leader’s Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.

Read Also: PVT04: వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!

ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ తో పాటు ఆయన అనుచరులు దీపక్ సింగ్ పై దాడి చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. గొడవను ఆపేందుకు పోలీసులు ఇరు వర్గాలను విడదీసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఎస్పీ ఎమ్మెల్యే చెప్పిన వివరాల ప్రకారం.. దీపక్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అక్కడే నిరసనలో కూర్చున్న తనని అసభ్యంగా తిట్టాడని, అందుకే తాను సహనం కోల్పోయి దాడి చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

దీపక్ సింగ్ తో పాటు అతని మద్దతుదారులు, తన మద్దతుదారులపై దాడి చేసినందుకు నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఈ నిరసనలు జరుగుతున్న సమయంలోనే దీపక్ సింగ్ గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వస్తూనే దీపక్ సింగ్ ఎమ్మెల్యేను, అతని మద్దతుదారులను తిట్టడం రికార్డ్ అయింది. ఆ తరువాత గొడవ ప్రారంభం అయింది. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇద్దరు నేతలకు సర్దిచెప్పడానికి కష్టపడ్డామని, ఇద్దరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Exit mobile version