Delhi Car Blast: వారం క్రితం ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘‘వైట్ కాలర్’’ మాడ్యూల్‌గా పిలువబడుతున్న ఈ ఉగ్రదాది వెనకాల ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు. ప్రస్తుతం, వీరిని అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఈ ఈ ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తుండగా, ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారులు అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యకలాపాలు, దీనితో సంబంధం ఉన్న డాక్టర్లపై నిఘా పెంచింది.
అయితే, ఈ పేలుడులో అత్యంత అస్థిరమైన పదార్థాన్ని ఉపయోగించినట్లు ఫోరెన్సిన్ నిపుణులు అనుమానిస్తున్నారు. ‘‘మదర్ అఫ్ సైతాన్’’గా పిలిచే ‘‘ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP)’’ని వాడి ఉండచ్చని చెబుతున్నారు. ఇది కేవలం వేడి కారణంగా పేలిపోయి ఉండొచ్చని, ఎలాంటి డిటోనేటర్ లేకుండా వేడి కారణంగా పేలుడు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని వాడారా లేదా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన i20 కారులో జరిగిన పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించబడిందని పోలీసులు ముందుగా అనుమానించారు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న ఉమర్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఉమర్ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించే ముందు TATP అస్థిర స్వభావం గురించి అతనికి తెలుసని దర్యాప్తు బృందాలు విశ్వసిస్తున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశం అత్యంత జనసాంద్రత కలిగిన చాందిని చౌక్ పక్కనే ఉంది.
ఏమిటి ‘‘సైతాన్ తల్లి’’..?
ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) అత్యంత అస్థిరమైన రసాయన పదార్థం. ఘర్షణ, పీడనం లేదా ఉష్ణోగ్రత వంటి భౌతిక వాతావరణంలో ఏదైనా మార్పుకు అత్యంత సున్నితంగా ఉంటుంది. దీంతోనే పేలుడు సంభవిస్తుంది. దీనికి డిటోనేటర్ అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అక్రమ బాంబు తయారీదారులు దీనిని ఎక్కువగా వాడుతారు. అందుకే దీనిని ‘‘సైతాన్ తల్లి’’ అని పిలుస్తారు. 2017 బార్సిలోనా దాడులు, 2015 పారిస్ దాడులు, 2017 మాంచెస్టర్ బాంబు దాడి,2016 బ్రస్సెల్స్ బాంబు దాడుల తర్వాత సమ్మేళనం జాడలు కనిపించాయి.
ఢిల్లీ పేలుడులో ఉపయోగించారా..
పేలుడు ప్రాంతంలో శక్తివంతమైన షాక్‌వేవ్‌లు వచ్చాయి. ఇది TATP పేలినప్పుడు సాధ్యమవుతుంది. ఫోరెన్సిక్ టీమ్‌లు TATP ఉనికిని నిర్ధారించడానికి అవశేషాలను విశ్లేషిస్తున్నాయి. పేలుడు తీవ్రత ప్రకారం పేలుడు పదార్థం చాలా వేడికి గురైందని, కారు లోపల అస్థిరంగా ఉందని సూచిస్తున్నాయి. ఇంకా పెద్ద ఉగ్రవాద ఆపరేషన్ కోసం దీనిని ఉపయోగించారా.? లేదా రవాణా చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పేలిందా? అనేది పరిశీలిస్తున్నారు.
నవంబర్ 10 దాడికి సంబంధించిన క్రమాన్ని అధికారులు రీ క్రియేట్ చేస్తున్నారు. ఉమర్ పేడులుకు చాలా సమయం పాటు ఢిల్లీలోని రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించాడు. ఒక వేళ పేలుడు లో TATP ఉనికిని కనుగొంటే, పేలుడుకు ముందు చాలా సేపు ఎలా స్థిరంగా ఉందో పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఉమర్ సహచరులైన డాక్టర్లు , షహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్,ఆదిల్ రాథర్‌లను అధికారులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధం ఉన్న మరికొందరు డాక్టర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.