Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును ఈ రోజు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే అధికార బీజేపీ కూటమి సంఖ్యా బలం, ఇతరత్రా లెక్కలతో సిద్ధమైంది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్ ముగియగానే బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. ఈ రోజు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు, రేపు రాజ్యసభ ముందుకు బిల్లు రానుంది. రెండు సభల్లో కూడా 8 గంటల గంట చొప్పున చర్చించనున్నారు.
Read Also: Tamil Nadu: ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్ విధానంతో ఇక్కట్లు.. రద్దు చేయాలని వ్యాపారుల బంద్..
లోక్‌సభలో పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై లోక్‌సభలో బీజేపీ తరుపున సీనియర్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ చర్చను ప్రారంభిస్తారు. బిల్లుపై ఉభయ సభల్లో జరిగే చర్చలో పాల్గొనాలని, బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ఇండీ కూటమి నేతలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పున:సమీక్షించాలని, ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ కోరుతోంది. మరోవైపు, ఈ రోజు పూర్తిగా సభలో ఉండాలని ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.