Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కమిటీలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన అన్ని సవరణలకు జేపీసీ ఆమోదం తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ప్రతీ మార్పును కమిటీ తిరస్కరించింది. బిల్లులో 14 నిబంధనలలో ఎన్డీయే సభ్యులు ప్రతిపాధించిన సవరణలు ఆమోదించినట్లు పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్ అయిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.
వక్ఫ్ ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లు కొందరిని అపాయింట్ చేయడానికి అధికారం ఇవ్వడంతో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్‌లో సభ్యులను రెండు నుంచి మూడుకు పెంచడం వంటి సవరణలు ఉన్నాయి. ఈ రోజు క్లాజుల వారీగా జరిగి ఓటింగ్‌లో అధికార ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎంపీలు సవరణకు అనుకూలంగా ఓటేయగా, 10 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో మొత్తం 44 నిబంధనలను చర్చించగా, ప్రతిపక్షాలు చేసిన సవరణలు 10:16 మెజారిటీలో వీగిపోయాయి.
జనవరి 28 నాటికి ముసాయిదా నివేదిక పంపణీ చేస్తామని, ఆ తర్వాత జనవరి 29న అధికారికంగా ఆమోదం తెలుపుతామని జేపీసీ ప్రకటించింది. ప్రతిపక్ష ఎంపీలు జేపీసీని విమర్శిస్తున్నారు. జగదాంబికా పాల్ ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కారని ఆరోపించారు. ఆయన నియంతృత్వ ధోరణితో వ్యవహరించాలని టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీ విలేకరులతో అన్నారు. అయితే, జగదాంబికా పాల్ ఈ ఆరోపణల్ని తిరస్కరించారు.
వక్ఫ్ బోర్డు నియంతృత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు-2024ను ఆగస్టు 08న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, విరణాత్మక పరిశీలన కోసం మరింత గడువు పెంచారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.