Site icon NTV Telugu

Bengaluru Traffic: కారులో వెళ్తే 44 నిమిషాలు, నడిచివెళ్తే 42 నిమిషాలు.. బెంగళూర్‌లో ట్రాఫిక్ పద్మవ్యూహం..

Bengaluru Traffic

Bengaluru Traffic

Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్కుకుపోతుంటాయి. ఇక వర్షాకాలం ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ.

తాజాగా బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలను చూపెడుతూ, గూగుల్ మ్యాప్స్ ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. నగరంలో కారులో వెళ్లే కన్నా, నడిచి వెళ్తేనే త్వరగా గమ్యస్థానం చేరుకుంటారని గుగూల్ మ్యాప్స్ ట్రాఫిక్ పరిస్థితిని చూపించింది. 6 కి.మీ కారులో వెళ్లడానికి 44 నిమిషాలు పడితే, నడిచి వెళ్తే 42 నిమిషాల్లో చేరుకోవచ్చని సూచించింది.

Read Also: Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..

ఆయుష్ సింగ్ అనే వ్యక్తి దీనిని స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌‌గా మారింది. బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుండి KR పురం రైల్వే స్టేషన్ వరకు 6 కి.మీ దూరాన్ని కారులో వెళ్లేందుకు 44 నిమిషాలు పడుతుందని, నడిచి వెళ్లే 42 నిమిషాల్లోనే చేరుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ సూచించింది.

‘‘”ఇది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది’’ అంటూ అతను క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో 3 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా మరో నెటిజన్.. ఇది ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో జరుగుతుందని, మరొకరు ముంబై, ఢిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. మరో నెటిజన్ ‘‘ భారతదేశ ట్రాఫిక్ రాజధాని’’ అని బెంగళూర్‌ని పిలిచారు. కొందరు ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజా రవాణాను ఎంచుకోవాలని అతడికి సలహా ఇచ్చారు.

Exit mobile version