Sharmistha Panoli: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివాదాస్పద పోస్ట్ పెట్టిన తర్వాత, ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనే ఆరోపణలపై ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పనోలికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఇదిలా ఉంటే, ఆమెపై కేసు పెట్టిన వజాహత్ ఖాన్ కనిపించకుండా పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదుదారు వజహాత్ ఖాన్ తండ్రి, గత ఆదివారం రాత్రి నుంచి తన కొడుకు కనిపించడం లేదని, పనోలి అరెస్ట్ అయినప్పటి నుంచి తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
కోల్‌కతా పోలీసులు శర్మిష్ట పనోలిని అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నేతలు ఆమెను విడుదల చేయాలని కోరుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మౌనంగా ఉన్న బాలీవుడ్ ముస్లిం ప్రముఖులను విమర్శిస్తూ ఆమె చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఆమె దుర్భాషలాడటంతో పాటు మతపరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆమెను అరెస్ట్ చేశారు.
Read Also: KTR : భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది
పలోని అరెస్ట్‌కు దారితీసిన కేసులో ఫిర్యాదుదారు అయిన వజాహత్ ఖాన్ కు పనోలి అరెస్టు తర్వాత బెదిరింపు కాల్స్ వచ్చాయని అతని కుటుంబం పేర్కొంది. ‘‘నా కొడుకు నిర్దోషి, లౌకికవాది. అతను హిందూ మతాన్ని అవమానించలేడు. శర్మిష్ఠ అరెస్టు అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయి’’ అని అతని తండ్రి సాదత్ ఖాన్ అన్నారు. హిందూ మతాన్ని అవమానించాడనే ఆరోపణలపై దాఖలైన కేసు గురించి ఆయన స్పందిస్తూ, తన కొడుకు ప్రొఫైల్ హ్యాక్ అయిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై వజహత్ తీవ్రంగా కలత చెందాడని చెప్పాడు.
కోల్‌కతా పోలీసులకు వహజాత్ ఖాన్‌పై అధికార ఫిర్యాదు అందిన తర్వాత ఇతడి మిస్సింగ్ ఆరోపణలు వచ్చాయి. శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ దాఖలు చేసిన ఫిర్యాదులో, వజాహత్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా అవమానకరమైన మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హిందువులను విమర్శిస్తూ వజహత్ ఖాన్ ‘‘రేపిస్ట్ సంస్కృతి’’, ‘‘మూత్రం తాగే వారు’’అంటూ కామెంట్స్ చేశారు. హిందూ దేవీదేవతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. హిందూ సంప్రదాయాలను , దేవాలయాలను, పండగలను అలహస్యం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఖాన్ చేసిన ఆరోపణ పోస్ట్ పై అస్సాంలో కేసు నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, రాష్ట్రం నుండి ఒక పోలీసు బృందం పశ్చిమ బెంగాల్‌ను వెళ్లి వజాహత్ ఖాన్‌ను కోర్టు ముందు నిలబెడుతుందని అన్నారు. శర్మిష్ఠ పనోలిని మే 30, శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో అరెస్టు చేసి కోల్‌కతాకు తీసుకువచ్చారు, అక్కడ ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మే 15న గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేశారు.
