Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. బుధవారం రాయ్‌పూర్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాయ్ ప్రమాణస్వీకారం జరిగింది. వీరితో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
90 స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 54 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్నికపై వారం రోజుల పాటు బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడింది. చివరకు గిరిజన నాయకుడిగా పేరున్న విష్ణుదేవ్ సాయ్‌కి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మాజీ సీఎం రమణ్ సింగ్‌ని పక్కన పెట్టేసింది.
1990 నుంచి బీజేపీ వెంటే ఉన్న సాయ్ ఛత్తీస్‌గఢ్ బీజేపీ చీఫ్‌గా పని చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ తొలి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గిరిజనులు ఎక్కువగా ఉండే నియోజవర్గాల్లో ఎక్కువ స్థానాలు సాధించింది. ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్‌గఢ్, దక్షిణాన ఉన్న బస్తర్ రీజియన్లలో బీజేపీ సత్తా చాటింది. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న సుర్గుజా ప్రాంతంలో మొత్తం 14 స్థానాలను, బస్తర్ ఏరియాలో 12 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.