Actor Vijay: టీవీకే అధినేత, స్టార్ యాక్టర్ విజయ్, నిన్న తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు. 100 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనక డీఎంకే కుట్ర ఉందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని టీవీకే న్యాయవాది అరివాజగన్ తెలిపారు. కరూర్ ర్యాలీలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించామని ప్రభుత్వం ఆరోపించడాన్ని ఆయన తోసిపుచ్చారు.
Read Also: Tirumala : అంగరంగ వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
రేపు హైకోర్టు మధురై బెంచ్ ముందు ఈ విషయాన్ని లేవనెత్తనున్నారు. “కరూర్‌లో జరిగిన సంఘటనలో కుట్ర, నేరపూరిత కుట్ర జరిగింది, కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర సంస్థ ద్వారా కాకుండా స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని మేము గౌరవనీయ హైకోర్టును అభ్యర్థించాము” అని చెప్పారు. తమిళనాడు పోలీసుల నుంచి సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై ఆయన మాట్లాడుతూ.. ఇది నేరపూరిత కుట్ర అని స్థానిక ప్రజల నుంచి మాకు విశ్వసనీయ సమాచారం ఉందని, మా వద్ద కొన్ని సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయని, కరూర్ జిల్లాలోని కొంతమంది అధికార పార్టీ కార్యకర్తల నేరపూరిత కుట్ర జరిగిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై టీవీకే స్పందిస్తూ.. తాము పోలీసులు విధించిన షరతులను ఉల్లంఘించలేదని చెప్పింది. గత రెండు నెలలుగా మధురై, తిరుచ్చి, అరియలూర్, తిరువారూర్, నాగపట్నం, నామక్కల్ లలో విజయ్ అనేక కార్యక్రమాలు నిర్వహించారని, కరూర్‌లోనే ఈ ఘటన ఎందుకు జరిగిందని టీవీకే పార్టీ ప్రశ్నిస్తోంది. ఇది సందేహాలకు తావిస్తోందని చెప్పింది.