NTV Telugu Site icon

West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!

Twist

Twist

పశ్చిమబెంగాల్‌లో నడిరోడ్డుపై ఓ జంటపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా ఈ ఘటనలో ట్విస్ చోటుచేసుకుంది. దాడి వీడియో కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. తన అనుమతి లేకుండా వీడియో వైరల్ చేయడంపై బాధితురాలు మండిపడింది. తనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ఈ వీడియో ఎవరు తీశారో కూడా తనకు తెలియదని.. వీడియో తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.

పశ్చిమబెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై అధికార టీఎంసీ నేత తాజ్‌ముల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మరోవైపు ఈ జంటపై విచక్షణరహితంగా దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు తాజ్‌ముల్‌ అలియాస్ జేసీబీని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడికి 5 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. ఇంకోవైపు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత ముజుందార్ కాస్తా ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో తాలిబన్ పాలన నడుస్తుందని.. షరియా చట్టం అమలవుతుందని మండిపడ్డారు.