NTV Telugu Site icon

Diwali celebrations: ఢిల్లీలో మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టిన యూఎస్ అంబాసిడర్

Diwalicelebrations

Diwalicelebrations

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్యంతో అదరగొట్టారు. స్టేజీపై కుర్రాడిలా రెచ్చిపోయి డ్యా్న్స్ చేశారు. మాస్ ప్రదర్శనతో స్టేజీని షేక్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన విక్కీ కౌశల్ నటించిన ‘‘బాడ్ న్యూజ్‌’’లోని ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్పులు వేశారు. 53 ఏళ్ల ఎరిక్ గార్సెట్టి.. గోధుమ రంగు కుర్తా, ఒక జత షేడ్స్ ధరించి హిట్ పాటకు డ్యాన్స్ చేశారు.

ఎరిక్ గార్సెట్టి గతేడాది భారత్‌లోని అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. వివిధ పండుగల్లో కూడా పాల్గొన్నారు. గతేడాది కూడా బాలీవుడ్ సినిమా సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. 1998లో వచ్చిన షారుఖ్ ఖాన్‌కు చెందిన హిట్ పాట అయిన ‘చయ్యా చయ్యా’కి నృత్యం చేశారు.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా దీపావళి వేడుకలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్వంలో వైట్ హౌస్‌లో దీపావళి ఈవెంట్‌ను నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ వేడుకలకు బైడెన్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, ప్రస్తుత అమెరికా అభ్యర్థి కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ మాత్రం ప్రచారంలో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.